హైదరాబాద్ : ఓ మహిళ తనపై 143 మంది లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆమె పలు అంశాలను పేర్కొంటూ 100పేజీల ఫిర్యాదు చేసింది. తనపై వివిధ రాష్ర్టాల్లో సామూహిక లైంగికదాడులు, వేధింపులు జరిగాయని, ఇప్పుడు తనకు ప్రాణహాని ఉందని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో 143 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
యువతి ఫిర్యాదులో తెలిపిన వివరాలు.. నల్లగొండ జిల్లాకు చెందిన యువతికి, మిర్యాలగూకు చెందిన ఓ వ్యక్తితో 2009 జూన్‌లో వివాహం అయ్యింది. అత్తవారింటి వేధింపులు తాళలేక 2010లో ఆమె భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తరువాత తల్లిగారింటికి వెళ్లి తన చదువును కొనసాగిస్తుండగా విద్యార్థి సంఘం నాయకులతో పాటు పలువురితో ఆమెకు పరిచయం ఏర్పడింది.
కొంతకాలం క్రితం రాజ్‌భవన్ రోడ్డులోని అపార్ట్మెంట్లో ఆమె అద్దెకు దిగింది. ఆ క్రమంలో ఓ మాజీ ఎంపీ పీఏ, ముగ్గురు విద్యార్థి సంఘం నాయకులు, మరో 139 మంది కొన్నాళ్లుగా లైంగికదాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. ఏండ్ల తరబడి వారు తనపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని, గర్భం దాల్చడంతో అబర్షన్ చేయించారని, నగ్నంగా చిత్రాలు, వీడియోలు తీశారని, సిగరెట్లతో కాలుస్తూ శారీరకంగా హింసించారని ఆమె ఫిర్యాదులో తెలిపింది. ఎవరికైనా చెబితే చంపేస్తామని తుపాకితో బెదిరించినట్లు ఆమె పేర్కొంది.
ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తును సీసీఎస్ లేదా సీఐడీకి అప్పగించే అవకాశాలున్నట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.