Home > అనాల‌సిస్ > మెగాస్టార్ బ‌ర్త్ డే స్పెష‌ల్‌: ఆచార్య మ‌న అందరివాడు

మెగాస్టార్ బ‌ర్త్ డే స్పెష‌ల్‌: ఆచార్య మ‌న అందరివాడు

మెగాస్టార్ బ‌ర్త్ డే స్పెష‌ల్‌: ఆచార్య మ‌న అందరివాడు
X

అలుపెరుగని స్వయంకృషికి అసలైన అర్ధంగా నిలిచిన అభినయాచార్యుడు, స్వ‌యంకృషికి ప‌ర్‌ఫెక్ట్ చిరునామా, కోట్లాది మందికి స్పూర్తిదాత మెగాస్టార్ చిరంజీవి నేడు 65వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు. ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో అభిమానులు, సెల‌బ్రిటీలు, ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌ల వెల్లువ కుర‌పిస్తున్నారు. నాలుగు ద‌శాబ్ధాల పాటు తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఉర్రూత‌లూగించిన కొణిదెల శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ అలియాస్ చిరంజీవి తన సినిమాల‌తోనే కాక సేవా కార్య‌క్ర‌మాల‌తోను ప్ర‌జ‌ల గుండెల్లో గూడు క‌ట్టుకున్నారు.

సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి ఇప్పుడు మెగాస్టార్‌గా అంద‌రిచే పిల‌వ‌బ‌డుతున్నాడు అంటే ఆయన చేసిన కృషి అసామాన్యం. కాలేజీ రోజుల‌లో ఎక్కువ‌గా సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌లో పాల్గొనే చిరు డిగ్రీ పూర్తిచేసిన తరవాత చెన్నై వెళ్లి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన రెండేళ్లకే సినిమాలో అవకాశం దక్కింది. హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, విల‌న్‌గా ఇలా ఎన్నో పాత్ర‌ల‌లో న‌టించి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందారు.

చిరంజీవి తొలుత 1978లో పునాది రాళ్ళు అనే సినిమాలో న‌టించారు. అయితే ఈ సినిమా క‌న్నా ముందు ప్రాణం ఖ‌రీదు అనే చిత్రం విడుద‌లైంది. దీంతో వెండితెర‌కి ప‌రిచ‌యం అయ్యారు. ఆయ‌న త‌న మొద‌టి సినిమాకి అక్షరాల 1,116 రూపాయల పారితోషికం అందుకున్నారు. ఇప్పుడు చిరు రెమ్యున‌రేష‌న్ గురించి తెలిస్తే క‌ళ్ళు తిరగ‌క‌మాన‌వు . ఎన్నో క‌ష్టాలు, ఇబ్బందుల న‌డుమ త‌న కెరీర్‌ని కొనసాగిస్తూ వ‌చ్చిన చిరంజీవి ఇప్పుడు ఎవరికి అంద‌నంత ఎత్తులో నిలిచారు. ముందుగా చిరంజీవికి సుప్రీం హీరో అనే బిరుదు ఉండ‌గా ఆ త‌ర్వాత ఆయ‌న సాధించిన విజ‌యాల‌కి అభిమానులు మెగాస్టార్ అనే బిరుదు క‌ట్ట‌బెట్టారు.

చిరంజీవి అంటే ఓ డ్యాన్స్, ఓ స్టైల్‌, ఓ గ్రేస్‌. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికీ చిరంజీవిని మించిన మ‌రో హీరో లేడంటే అతిశ‌యోక్తి కాదు. ఆయ‌న డ్యాన్స్‌లు, ఫ్లైట్లకి అభిమానులు పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోయేవారు. 1994 నుంచి 96 వరకు కెరీర్ పరంగా కొంత ఇబ్బంది ప‌డ్డ చిరు ఆ త‌ర్వాత హిట్ల‌ర్, మాస్ట‌ర్, ఇంద్ర‌, ఠాగూర్ సినిమాల‌తో ఓ రేంజ్‌కి వెళ్ళిపోయారు. అయితే 20008లో రాజ‌కీయాల‌ని వెళ్లిన చిరు 2017లో మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. 'ఖైదీ నెంబర్ 150'లో నటించి తన సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టారు. ఈ సినిమాతో చిరు బాక్సాఫీసుల‌ని బ‌ద్ద‌లుగొట్టి త‌న స్టామినా ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపించాడు.

గ‌త ఏడాది త‌న కెరీర్‌లో తొలిసారి సైరా అనే చారిత్రాత్మ‌క చిత్రంలో న‌టించాడు. ఈ సినిమా ప్రేక్షకుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య‌ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స‌ర్‌ప్రైజ్ సాయంత్రం 4గం.ల‌కి రానుంది. అయితే మెగాస్టార్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ కామన్ డీపీ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇది చిరంజీవి కెరీర్‌ని ప్ర‌తిబింబించేలా ఉంది. అలానే చిరు బ‌ర్త్‌డే మోష‌న్ పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేశారు. దీనిని 100 మంది సెల‌బ్రిటీలు సామాజిక మాధ్య‌మాల ద్వారా విడుద‌ల చేయ‌డం విశేషం. అభిమానుల‌కి, ఇండ‌స్ట్రీకి అంద‌రివాడులా నిలిచిన అన్న‌య్య ఇలాంటి బ‌ర్త్‌డేలు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని మ‌న‌మంతా కోరుకుందాం.

Updated : 2020-08-26T18:18:15+05:30
Next Story
Share it
Top